శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ
Story of Vibhava Lakshmi Vrat, Legend Of Vibhava Laxmi Vratamu
Vaibhava Lakshmi Vratha Katha |
పూర్వమొకప్పుడు కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుని చూసి, "ఓ ప్రాణ నాథా! భూలోకంలో మానవులందరూ ధనార్జనకోసం ఎడతెరపి లేకుండా శ్రమ పడుతూనే వున్నారు. అయినా వారిలో అతికొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి?" అని, అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి - "దేవీ! సర్వమూ వైభవలక్ష్మిదెవి దయనుబట్టి వుంటుంది. సమస్త సంపదలకూ, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత, కాబట్టి, ఎవరయితే ఈ సత్యాన్ని గ్రహించి - ఆ వైభవలక్ష్మి యందు, భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారిపట్ల మాత్రమె ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడుతాయి.
అలా ఆమె దయకు పాత్రులైన వాళ్లు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలనూ సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి, అంతా తమ స్వయం కృషేయని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని యీసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి, ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరిసంపదలతో, రాజ వైభోగాలతో తులతూగుతారు." అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి "ఓ ప్రభూ! ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహాత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి." అని వేడగా, ఆ పరమేశ్వరుడు మరల ఈవిధముగా చెప్పసాగాడు. "ఓ దేవీ! అత్యంత పున్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్దగా వినుము" అని ఈ విధముగా చెప్పసాగెను.
పూర్వము ఒకప్పుడు భృగుమహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సుచేసేను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్ష్యమయి ఏమి వరము కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగుమహర్షి ఆమెకు నమస్కరించి "ఓ తల్లీ ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటి పైననే నడుస్తోంది. మహామయయైన నీ శక్తి కళ పార్వతియై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ సరస్వతి యై బ్రహ్మతో మసలుతుంది. ఇక స్థితి కారకమైన నీయొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు" అని కోరెను. ఆ తల్లి అతని కోర్కెను మన్నించెను. తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించినది. భృగుమహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీ హరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ యెనలేని సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కాని ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకానోక దోశమునకుగాను దూర్వాసుడు ఇచ్చిన శాపంకారణంగా - ఆ వైభవలక్ష్మి దూరం అయి పోయినది.
ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహ తప్తుడైన విష్ణువు కూడా, ఆలోచించి - లక్ష్మిమయమైన క్షీరసాగరాన్ని మధించటం వల్లనే పునః కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు - మందరగిరిని కవ్వంగాను, 'వాసుకి' అనే మహా సర్పాన్ని కవ్వపుత్రాటిగాను అమర్చి - క్షీరసాగరాన్ని మధించగా - వైభవలక్ష్మి ఆ సముద్రంనుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయములో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్ధనలను మన్నించి ఆ తల్లి ఎనమిది మూర్తులుగా భాసించింది. ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మిదేవి. ఆమెనే ఐశ్వర్య లక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు.
సర్వ ఐశ్వర్య ప్రదాయిని అగు ఈ తల్లి మహాభిమాని, ఆమెయందు కొంచెము కూడా అపచారము జరిగిన మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను, పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరు కలిసి లక్ష్మిదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్లిన భృగువుకు, అక్కడ అవమానము ఎదురౌతుంది. తనరాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మ దేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగానివారి వలే సరస సల్లాపములలో మునిగి వుండిరి, అది చూసిన భృగువు పట్టరానికోపముతో అక్కడనుండి వైకుంఠమునకు చేరాడు. ఇక్కడ లక్ష్మీ నారాయణులు ఇద్దరూ పాచికలాటలో ఉండి పోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరానికోపముతో విష్ణువుయొక్క వక్షస్థలము పైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా ఆ మహర్షిని ఆరాధించి, శాంతపరచి పంపివేశాడు. కాని అందు నిమిత్తమై ఆ లక్ష్మీ దేవి అలిగినది. తన నివాస స్థానమైన విష్ణు వక్ష స్థలాన్ని తన్నిన భృగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరిమీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తులమీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురము నందు ఉండెను.
ఓ ప్రార్వతీ! భక్త సులభ, అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము.
చాలాకాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు వుండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తులద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కాని, రానురాను వారిలో అహంకారము తలెత్తింది. దైవచింతన తగ్గింది, శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలననే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు.
మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వలననే ప్రపంచం తనని గౌరవిస్తోందనే భావన కలిగింది. "ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది" నానోట్లో విద్య ఉంది, ఎంత గోప్ప వాళ్ళయినా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు? అని భావించాడు. ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువలేకుండా పోయింది. సంపాదించిన ధనం అంతయు ఖర్చు అయిపొయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్య్రమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమటించసాగారు.
రాజాస్థానంలో ఉపదళాధిపతిగా వుండే సుశీల భర్త, ఒకానొక యుద్దంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి, అహంకారముతో తనబలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణం అని భ్రమించాడు. అందుకు ధన లక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి, తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానములో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటిని స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది.
వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహముకన్న తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని తన పెట్టుబడితో, మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను. అంతేగాని సంపాదించిన దంతా దైవానుగ్రహమువలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నియు మానివేశాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడము మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి, అతని కుటుంబము దారిద్య్రములో మునుగుతుంది.
ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని, అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడుమిత్రులవల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరంవలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడై పోయాడు. ఋణదాతల పీడా, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు.
అయినా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఎదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మి దేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు వుండినా ఫర్వాలేదు. తమ బిడ్డలకయినా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీ దేవిని ప్రార్ధించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయగలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్ధిస్తున్న శుభ సందర్భములో ఆ వైభవలక్ష్మి దేవి ఒక వృద్ద స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పసాగింది.
పిల్లలూ! మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతిత్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను, తక్షణమే మీ అక్కాచెల్లెళ్లు నలుగురూ మీ మీ ఇళ్ళల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి.
అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెళ్లు, అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వా ఇంతకూ ఈ వ్రతాన్ని ఏవిధంగా చెయ్యాలి. ప్రస్తుతము మేము దారిద్య్రములో వున్నాముగదా! ఆ వ్రతానికి యెంత ఖర్చు అవుతుంది? అని ప్రశ్నించారు. అందుకా వృద్ద మాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది.
ఓ అమ్మాయిలూ! ఇదేమి ఖర్చుతో కూడిన పనికాదు. ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములుగాని, శుక్రవారములుగాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు, తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారమునాటి మరునాడు వచ్చే శుక్రవారమునాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకొనే వారు ఆఖరి శుక్రవారమునాడే ఉద్యాపన చేసుకోవాలి.
ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారమునాడు గాని ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటుపోసుకొని "అమ్మ వైభవలక్ష్మి దేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు" అని మ్రొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచీ శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము.
ఏ ఇంటిలో వారయితే అతిధి అభాగ్యతులకు దాసులవలే ఉండి, వారి పాదములను కడిగి, ఆ తీర్ధం శిరస్సున చల్లుకొని, తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరచి, సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు, దేవతలు సదా పూజింపబడుతారో, ఏ ఇంటి వారు పరులపట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై, నిత్య సంతోషిగా వుంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా వుంటుంది.
వైభవలక్ష్మీ వ్రత విధానము
Vibhav Lakshmi Pooja Vidhanam
పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్నములతో గాని లేదా బియ్యపుపిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను బెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరచి, ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి, దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులుగాని వుంచి వాటిమీద కొబ్బరికాయను, దానిమీద ఒక రవికలగుడ్డను పెట్టి, ఆ మీదుట ఒక యెర్రని పువ్వును పాత్రలో వుంచి, అందులో ఒక బంగారు/వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో వున్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి, అగరువత్తులతో ధూపం వెయ్యాలి.
అమ్మాయిలూ! అమ్మవారికి లక్ష్మిగణపతి అన్నా శ్రీ చక్రమన్నా చాలా ఇష్టము. కాబట్టి, ముందుగా లక్ష్మిగణపతిని , శ్రీ చక్రాన్ని పూజించి, అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్ధాన్ని నివేదన చెయ్యాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపుకోమ్ములను వుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్ధము చెయ్యలేనివారు బెల్లం పటికబెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్ళను సంతానాన్ని కోరుకొనేవారు మామిడిచెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకొనేవారు తులసి చెట్టు మొదలులోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకొనేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పూయాలి. కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడము ద్వారా నిరుద్యోగులు వుద్యోగవంతులవుతారు, అవివాహితులకు వివాహము జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏయే కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి. అని ముగించిందా వృద్ద మాత.
తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లు నలుగురూ వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారములపాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురు కడుపేద వాళ్ళయి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని వుంచి పూజించింది. సుశీల రూపాయి నానాన్నే వుంచి పూజించింది. గుణశీల తన ఇంట వున్న వెండి నాణాన్ని వుంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కేరను వుంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏయే రూపాలలో ఆరాధించిననూ వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి దేవి.
వారు వ్రతము ప్రారంభించిన అతికొద్ది సమయములోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి, తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు వున్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ద నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్టుడైన, సుశీల భర్తను విడుదల చేసి, అతనినే దళపతిగా అభిషేకించి యుద్దానికి పంపక తప్పలేదు. ఆ యుద్దంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి, దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది.
అకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పులవలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయములో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది.
ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనములన్నింటినీ ఒకదాని తరువాత ఒకటిగా వదిలి వేసినాడు. తన కుటుంబము పట్ల ఎంతో శ్రద్ధ కనబరచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలే సుఖ సంతోషములతో జీవించసాగింది.
కాబట్టి స్త్రీలుగాని, పురుషులుగాని, ఆబాలగోపాలమెవరు తనను పూజించినా సరే, తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నెరవేర్చును.
శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ సమాప్తం.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.