Pages

Katyayani Vratha Katha

Katyayani Vratha Katha
Katyayani Vratha Katha
 శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ
Katyayani vrat story, Legend of Katyayani Vrathamu

పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారణ్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి. అయ్యా! ఇప్పుడు కూడా మాకొక ధర్మసందేహము తీర్చవలెను, అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగామొనరించెను గదా! ఆ విధముగా, జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయెనా? లేక సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి ఓ మునులారా! మీ సందేహమును తప్పక పోగొట్టెదను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నోసంగెను. సతీ దేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా కృతయుగము అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్దానము అయ్యెను. సతీ దేవి, ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాథా! మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఎందులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విష్ణువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రి వంటి వాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెదుకుచూ ఆ అడవింతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగ బాధచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని. కాని మానవ రూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు బోయెను. అందుకే నేను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.

ఆ మాటలు విన్న సతి ఓ నాథా! మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుట ఏమి? సీతకోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి నమ్మ శక్యముగాలేవు మీరు పరిహాసమాడుచుంటిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా? అని పల్కెను. వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని యెడల స్వయముగా నీవే అచటకుబోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము. నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీ దేవి ఓ నాథా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముని పరీక్షించదలచి "నేను సీతగా మారిపోవలేయునని" తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగింపదలచితివా? నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును. అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై ఉండగలదు. అని పలికి అదృశ్యమయ్యెను.

శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాథా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి? అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాథా! నీవు పరీక్షించిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవుదాల్చిన నా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది. నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నొందితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదలుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమొనరించు కోరికను కలిగించెను.

ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా, సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుని కలిసి వెల్లుదుమని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలయునని మంకు పట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని, బృంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.

దక్షుని యాగమంటపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పలకరింప పోవుటచే అవమానముగా భావించి రగులుచున్న అగ్ని గుండము చెంతకు చేరి చేతులు జోడించి "ఓ అగ్ని దేవా! నేనొక అబద్దము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కళంక మొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము". అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీ, బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను స్మశాన వాటికగా మార్చెను.

ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను . ఆ సమయమున పరమేశ్వరుని లలాటమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగనే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భూన భువనాంతరాలు ప్రతిధ్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునోంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మొసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో "ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్ధకనాముడు కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అనికూడా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు. ఇతడు ఇంత కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారముఅగును". అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.

హిమవంతుడు ఒక పర్వత రాజు. అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే "కాత్యాయని" అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే "పార్వతి" అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కళాకోవిదయై వెలుగొందెను. మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెలో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భస్మీపటలము గావించి వెడలిపోయెను.

పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము కావించుకోదలచి కఠోరమైన తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్దము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవో పేతముగా శివపార్వతుల కళ్యాణమును బ్రహ్మ స్వయముగా జరిపించెను.

శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో "ఓ నాథా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని. తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను. వెంటనే శివుడు ఆమెతో "ఓ పార్వై! కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఇప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే నేనునూ అందు భాగాస్వాములమైతిమి. "కాత్యాయనివ్రతము" అను పేరుతొ భూలోకములో సుస్థిరము కాగలదు. అని పలికెను. ఆమాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను. అని సూత మహర్షి శౌనకాదులకు వినిపించెను.

కాత్యాయని వ్రత విధానము:
 Performing Katyayani Vrat, How to Perform Katyayani Vrat, Katyayani Vratha vidhanamu

వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకు కాత్యాయని వ్రతముతో సాటియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరించువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఆ రోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకొని భక్తి శ్రద్దలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతిపూజచేసి ఆ పిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిడి చిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్దలతో ఇరవది ఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించవలెయును. ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశమునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు  ఏడు చెఱుకు ముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్దలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో చేయవలెను. మధ్యలో ఏ వారమైన అడ్డంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను. ఎనిమిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలెను. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చెఱుకు ముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లెదరు. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.